

పాఠకులు అందరికీ నమస్కారం
తెలుగు భాషాభిమానులుకి ఆహ్వానం. మా అమ్మ గోగినేని మణి రాసిన కధలను పుస్తకరూపం లో పరిచయం చేశాము. ఆ పుస్తకాలను మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశం తో చేసిన ప్రయత్నమే మా ఈ బ్లాగ్.
మా అన్నా చెల్లెళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచీ పుస్తకాలంటే పిచ్చి .. తెలుగంటే చాలా అభిమానం. మా ఈ పఠనాసక్తికీ, సాహిత్యాభిలాషకీ మా అమ్మ ప్రేరణే అధికం. మా అమ్మ తన పెళ్లి తర్వాత ఇంటి నుండి తెచ్చుకున్న సామానులలో సగ భాగం తన సాహిత్యాభిలాషకు అద్దం పట్టే పుస్తకాలే అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ మా ఇంటి నుండా పుస్తకాలే. కవి విశ్వనాధ సత్యనారాయణ గారి ” వేయి పడగలు ” నుంచీ శ్రీ శ్రీ గారి ” మహా ప్రస్థానం దాకా.. యండమూరి వారి ప్రార్థన నించీ యద్దనపూడి వారి జాహ్నవి వరకూ.. అన్నీ మా ఇంట్లో కొలువున్నాయి. అలా అమ్మ వల్ల తెలుగన్నా.. తెలుగు సాహిత్యమన్నా.. మా ఇద్దరికీ .. ఒక వ్యసనం లా అయిపోయింది.
మా అమ్మ తన చిన్నప్పటినుంచే తెలుగులో అడపాదడపా వ్యాసాలు రాసేదంట . కానీ మాకు మాత్రం తన తొలి కధ 1987 లో పత్రికలో ప్రచురితమైనప్పుడు మా నాన్నగారు చేసిన హడావుడి, స్కూల్ లో మా ఫ్రెండ్స్ అందరికీ మా ‘అమ్మ ‘ పేరు చూపించి మేము పొందిన ఆనందం ఇంకా గుర్తుంది. అప్పటినుండీ గత 35 ఏళ్లుగా అమ్మ కధలు పత్రికలలో ప్రచురితమైన ప్రతిసారీ, అదే ఆనందం.. అదే సంతోషం.
“రాశి కన్నా వాశి ముఖ్యం” అన్నట్లు మా అమ్మ రాసినవి తక్కువ కధలే అయినా, అన్నీ ప్రముఖుల ప్రశంసలు పొందటం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అమ్మ కధలు రాయటం వెనక మా నాన్నగారి ప్రోత్సాహం చాలా వుంది. నాన్న గారే పట్టు బట్టి అమ్మ కధలన్నింటికీ ఒక శాశ్వత రూపం ఇవ్వటానికి “కధా సంపుటాలు”గా ప్రచురించారు. అలా మొట్టమొదట May 2006 లో 18 కధలతో ” తొలిచూపు ” మరియు 20 కధలతో ” మనసున మల్లెలు ” రెండు కధా సంపుటాలు వెలువడ్డాయి. వీటికి ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాధ్ గారు మా అమ్మ కు స్పూర్తి నిచ్చేలా ప్రశంసలతో ముందు మాట రాయటం మా అందరికీ చాలా ఆనందదాయకంగా అనిపించింది . ఆయనతో పాటూ అమ్మ రచనలను చదివి ,ప్రశంసలు-సునిశిత విమర్శలతో తనకు మరింత స్పూర్తి కలిగించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు, కాళీపట్నం రామారావు గారు, గిడిగు రాజేశ్వర్రావు గారు, ముళ్ళపూడి రమణ గారు, తదితరులందరికీ మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఆ తర్వాత ఏప్రిల్ 2011 లో 17 కధలతో మూడవ కధా సంపుటి ” మొగలిపువ్వు ” , Feb – 2020 లో 22 కధలతో నాల్గవ కధా సంపుటి ” పిచ్చుక గూడు “కూడా ప్రచురింపబడ్డాయి. నవ్య లో సీరియల్ గా వచ్చిన ” కలవారి కోడలు” ను ” సుజన” పేరుతో జులై 2011 లో నవలగా ముద్రించాము.
అమ్మ కధలను కన్నడ బాష లోకి అనువదించిన సులోచన గారికి, అనువదించిన కధలను ” హో గళ సేతువే ” పేరుతో కన్నడ కధా సంపుటిగా అందించిన కస్తూరి గారికి మా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా .. అమ్మ కధల మీద పరిశోధన చేసి ” గోగినేని మణి రచనలు- పరిశీలన ” పేరుతో Ph . d గ్రంధాన్ని ప్రచురించిన పరిశోధకుడు ఎల్. ఆర్జునరావ్ గారికి మా ధన్యవాదాలు.
మా అమ్మ రచన లన్నిటి లోనూ మధ్య తరగతి మనుష్యుల ఆప్యాయతా -అనురాగాలూ, విలువలూ-సంస్కారాలూ, వుండటంతో , మా అమ్మ కధలు చదువుతుంటే, అందరికీ వారి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టే వుంటుంది. మానవ సంబంధాలు క్రమంగా బలహీన పడిపోతున్న ఈ తరుణంలో మా అమ్మ కధల ద్వారా ఎంతో మంది స్పూర్తి పొందామనీ , మళ్ళీ తమ పాత అనుబంధాలు గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయనీ పలువురు పాఠకులు తమ తమ స్పందన తెలియచేస్తూ వుండటంతో.. అంతర్జాలంలో బ్లాగ్ ద్వారా అమ్మ తన పాఠకులకు మరింత చేరువ కాగలదని మాకు అనిపించింది. ఆ చిరు ప్రయత్నమే .. మా ఈ గోగినేని మణి. బ్లాగ్ (goginenimani.blog)
మా అమ్మ రచించిన తెలుగు కధలు శాశ్వతంగా వుండాలనే స్వార్ధం తో పాటూ, అంతర్జాతీయంగా ప్రతీ తెలుగు పాఠకునికీ చేరాలన్నదే మా బ్లాగ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ బ్లాగ్ లో అమ్మ ఇప్పటిదాకా రాసిన కధలన్నిటినీ మీ కోసం వుంచుతున్నాం. అంతే కాకుండా, సాహిత్యం మీద అభిలాష వుండీ , పుస్తకాలు చదివే సమయం లేని కొత్త/పాత జనరేషన్ వారికి అమ్మ కధలను ప్రతీ వారం ఒక కధ చొప్పున చదివి audio files గా కూడా మీ ముందు వుంచుతాం.
మా ఈ ప్రయత్నాన్ని ఆదరించి, మరిన్ని సలహాలు- సూచనలతో ప్రోత్సాహిస్తారనీ, మా అమ్మ రచయిత్రి- గోగినేని మణి గారితో అనుసంధానంలో వుంటూ, తననుండి మరిన్ని మంచి రచనలు వచ్చేలా స్పూర్తి నిస్తారని ఆశిస్తూ.. ..


Follow the Blog
Get new content delivered directly to your inbox.
Leave a reply to M+sampoorna స్పందనను రద్దుచేయి